Wednesday, December 9, 2020

ఏ బంధం ఈ అనుబంధం

ఇద్దరూ అపరిచితులే. పది రోజుల క్రితం ఒకే రోజు ఆస్పత్రిలో చేరే దాకా. వాళ్ళ ఇద్దరిలో మేరీ నా పేషెంట్. నేను చూడటానికి వెళ్లిన ప్రతిసారి, ఇద్దరు తెగ కబుర్లు చెప్పుకుంటూ కనిపించేవారు. నేను మేరీ ని ఏదన్నా అడిగితే, పక్కనుండి, ఇదిగో డాక్టర్ పిల్లా, ఇవాళ టెస్ట్ కి వెళ్ళాలి కదా, పాపం భయపడుతుంది, ఏదన్నా గట్టి మందు రాయకూడదూ, టెస్ట్ లో నిద్దరపోతే భయం లేకుండా ఉంటుంది, అని తనకి తోచిన సలహా పడేసేది.
నేను వివరంగా నా పేషెంట్ కి ఎం చెప్పినా కళ్ళు చిన్నవి చేసి, చెవులు పెద్దవి చేసుకుని జాగ్రత్తగా విని ఆవిడే వివరణ అడిగేది. నాకు ఆవిడ పెరు తెలీదు. రూల్ ప్రకారం మన పేషెంట్ కాకపోతే మనం వాళ్ళ గురించి తెలుసుకోకూడదు, వాళ్ళ చార్ట్ చూడకూడదు. 

మొన్న నాకంటే ముందు, పక్కనావిడ డాక్టర్ ఆమెని చూడటానికి వెళ్లాడట. ఆయన సెల్ ఫోన్ రింగ్టోన్ ఎదో డిస్కో సాంగ్ లాగా ఉంది, ఆయన వయసెంటి, ఆ సాంగ్ ఏంటి అని ఇద్దరు ఒకటే పక్కట్లడ్తున్నారు నేను వెళ్ళేప్పటికి.
తన టీ కప్ లో బ్రెడ్ ముంచి మెత్తగా చేసి పక్కనావిడకి పెడ్తుంది మేరీ. నా వైపు చూసి, సరిగ్గా మింగలేకపోతుంది నా ఫ్రెండ్, నువ్వైనా ఆ సూప్ లు, పుడ్డింగులు కాకుండా మాములు ఫుడ్ ఆర్డర్ చెయ్యచ్చు కదా, ఆ ముసలి డాక్టర్ దీనికి తిండి పెట్టట్లేదు అని మేరీ మోర పెట్టుకుంది.
అలా నా పేషెంట్ కానీ వాళ్ళకి ఆర్డర్స్ నేను పెట్టకూడదు, sorry అని ఒక జాలి చూపు మాత్రమే ఇచ్చి వచ్చేసాను.

మరునాడు మేరీ ని వేరే రూమ్ కి మార్చారు. అవసరాన్ని బట్టి, అసలే కోవిడ్ టైం కాబట్టి, అలా మార్చటం మాములే.
ఆ రోజు పని కాస్త ఎక్కువగా ఉండి నేను కూడా వివరాలు అడగలేదు. నిన్న మేరీ కి కొన్ని టెస్టులు ఉన్నందువల్ల మాట్లాడటం కుదరలేదు. 

ఇవాళ నన్ను చూడగానే, మేరీ ఏడవటం మొదలెట్టింది. నిన్న చేసిన టెస్ట్ లో తనకి కాన్సర్ అని తెలిసింది, అందుకే ఏడుస్తుంది అని నేను సముదాయించటానికి వెళ్ళాను. నా ఫ్రెండ్ కి ఎలా ఉంది అని అడిగింది మేరీ. ఎవరు? నీ రూమ్మేట్ ఆ అన్నాను.
అవును, తన ఫోన్ నెంబర్ ఉంది కాని, ఏదన్నా జరగరానిది జరిగి ఉంటుంది అని భయం.. అందుకే నేను ఫోన్ చెయ్యలేదు. మొన్న ICU కి తీసుకెళ్లారు. కనుక్కుని చెప్పవా, తను బాగుంది అని ఒక్క మాట చెప్పు చాలు అని బావురుమంది.

నాకు ఆ వివరాలు తెలీదు. రూల్ ప్రకారం తెలుసుకోకూడదు కూడా. కానీ ఏ పరిచయము లేని ఇద్దరు పది రోజుల్లో అక్కా చెల్లెళ్ళ లాగా అంత అనుబంధం పెంచుకున్నారు. చావు బ్రతుకులలో, ఇంకేమీ చెయ్యలేకపోయినా, మాట సాయం చేస్తే తప్పు లేదు అని ICU లో వివరాలు కనుక్కుని వచ్చాను.

She did not make it అన్నారు నర్సులు. చేరినప్పుడు కోవిడ్ టెస్ట్ నెగటివ్ ఉండింది. మొన్న ICU కి మారుస్తూ మళ్ళీ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. నీ పేషెంట్ ని వేరే రూమ్ కి మార్చటానికి కారణం అదే అన్నారు.

మేరీ కి ఈ వివరాలు చెప్పాను. చాలా బాధ పడింది. ఆపరేషన్ కి వేరే హాస్పిటల్ కి వెళ్తుంది రేపు. నీ ఫ్రెండ్ నుండి నీకు కోవిడ్ అంటుకునే అవకాశం ఉంది, అని చెప్పాల్సిన జాగ్రత్తలు అన్నీ చెప్పాను. I dont care, my friend was more important to me అన్నది. 
కేసులు ఎక్కువ అవుతున్నాయి అని విజిటర్స్ ని రానివ్వటం లేదు. నా రూమ్ లో ఉండనిస్తే కనీసం నా ఫ్రెండ్ చెయ్యి పట్టుకునేదాన్ని, ఆఖరి క్షణాల్లో నేను తోడు ఉండేదాన్ని కదా, అలా వంటరిని ఎందుకు చేశారు అని భోరున ఏడ్చింది.
ఎం చెప్పను? 


 

Wednesday, July 29, 2020

Buttamma

బుట్టమ్మ ఎవరో కాదు, మన అమ్మమ్మ గారి ఇంటికి బస్సు దిగి వెళ్లే దారిలో,  ఎప్పుడూ  గానుగ లో వేసినట్టు ఏదో ఒకటి నములుతూ , మనకి కూడా చొక్కా జేబులో కాసిని అప్పచ్చలో , బఠాణీలో పెట్టి నోటారా పలకరించేది చూడు..ఆవిడే. 

బుట్టమ్మ సార్ధక నామధేయురాలు.. మొదటి నుండి బాగా తిని బతికిన ఇంటి నుండి వచ్చిన మనిషి. ఆ కాలానికి తగ్గట్టు చిన్నప్పుడే ఆటంకరావు కి ఇచ్చి పెళ్లి చేశారు. ఆయన పేరుకి తగ్గ మనిషో కాదో తెలీదు కానీ, బుట్టమ్మ కి , ఆవిడ తిండికి మధ్య మాత్రం ఆటంకమే. 
ఆయన సన్నగా గడకర్ర లాగ ఉండేవాడు, పరమ పీనాసి. 

ఈ ఆటంకరావు పొలానికి వెళ్లేప్పుడు పొద్దున్నే బియ్యం బస్తా లో నాలుగు గీతాలు గీసి, పప్పు, బెల్లాలు ఇనప సొరుగు లో పెట్టి తాళాలు తనతో తీసుకుపోయేవాడు. 
ఆయన వీధి చివరికి వెళ్ళగానే,  మన బుట్టమ్మ పాలేరు సుబ్బిగాడిని పిలిచి, ఒరేయ్ !తెలుసుగా..ఇవాళ అర డజిను తీసుకురా..త్వరగా అని పంపించేది. పాలేరు వెళ్లి కోడిగుడ్లు పెద్దవి ఏరి మరి తెచ్చిచ్చేవాడు.

ఈవిడ పెట్టెలో దాచుకున్న ఉల్లిపాయ తో పాటు, పెరట్లో పండిన రెండు మిరపకాయలు కోసి, ఓ రెండు రెమ్మలు కరేపాకు దూసి, చిటికెడు వెన్నపూస, కాస్తంత ఆవదం మూకుడు లో వేసి వేయిస్తే , ఆ  అరడజను గుడ్లతో వేసిన అట్టు బుస్ బుస్స్ మని పొంగాల్సిందే., అటు వైపుగా వెళ్తున్న ఆడాళ్ళ నోళ్ళ మీద ముసిముసి నవ్వులు చిందాల్సిందే.!

ఎసరు పోసి అన్నం ఉడుకుడుకుగా వండుకుని, (మళ్ళి  బస్తా పైన సాఫుగా సర్ది ,నాలుగు గీతాలు గీసేసి)ఈ అట్టు తో పాటు ఏ పచ్చడో వేస్కుని కడుపు నిండా తినేసి, మూతి తుడిచేసుకుని, గిన్నె కడిగి అవతల పెట్టేది. 

సాయంత్రానికి ఈసురోమని ఇంటికి చేరే ఆటంకరావుకి రోజు ఎండిపోయి, పిడచకట్టేసిన నిమ్మకాయ పచ్చడో , అల్లప్పచ్చడో పెడితే, పెళ్ళానికి రెండు మెతుకులు మాత్రమే మిగిల్చి, నువ్వూ  తిను అని ఓ మాట అనేవాడు.   బుట్టమ్మ .. ఆబ్బె! ఆకలి లేదు లే అని నిట్టూర్చుకుంటూ పక్కకి వెళ్లెది . 

తన తర్వాత తినటానికి పిల్లా  పీచూ లేరు, ఐనా ఈ  ఆరాటం దేనికో ఆటంకారావుకి . ఆవిడ తో చక్కగా ఉంటె ఆయనకి  కూడా అట్టు లో భాగం పెట్టేది కదా బుట్టమ్మ. పిచ్చి మానవుడు, ఏనాడు కనీసం ఒక్క గుడ్డు అట్టు కూడా తినకుండానే అర్ధాంతరంగా పోయాడు. బుట్టమ్మ మాత్రం ఆయన పోయాక ఇంతకింత అయ్యింది సంతోషం తో.